Thursday, February 05, 2009

నేను సోషలిస్ట్ ను ఎలా అయ్యానంటే…


హెలెన్ కెల్లర్

గత కొద్ది నెలలుగా వార్తాపత్రికల్లో నా పేరు సోషలిజంతో కలిపి కనిపిస్తోంది. ఈమధ్య నా స్నేహితుడొకడు కూడా చెప్పాడు - పత్రికల మొదటి పేజీల్లోనే బేస్ బాల్, రూజ్ వెల్ట్, న్యూయార్క్ పోలీసూ కథనాలతో నా పేరు కనిపిస్తోందని. ఇదంతా మరీ నన్నంతగా సంతోషపెట్టకపోయినా, ఎంతో మంది ప్రజలు నా పట్ల, నా ఉపాధ్యాయురాలు మిసెస్ మేకీ (ఆన్ సల్లివాన్)పట్ల ఆసక్తి కనపరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. కొన్ని సార్లు నిర్దయకూడా ఎంతో మేలు చేసినట్లుగా, నా గురించిన వార్తలు కూడా తరచుగా పత్రికల్లో పడడంద్వారా సొషలిజం అనే మాటకూడా పత్రికల్లో పదే పదే వస్తుంది కదా.

నా మీద, నా అభిప్రాయాల మీద జరుగుతున్న ప్రచారానికి కొంతలో కొంతైనా న్యాయం చెయ్యడానికి ఇకపై నేను కూడా సోషలిజం మీద ఏదో ఒకటి రాయాలనుకుంటున్నాను. ఇంతవరకు ఆ విషయం మీద నేనేమీ మట్లాడలేదు, రాయనూలేదు. అతికొద్దిమదికి ఉత్తరాలు మాత్రం రాశాను. వాటిలో కామ్రేడ్ ఫ్రెడ్ వారెన్ కు రాసింది అప్పీల్ టు రీజన్ పత్రికలో అచ్చయింది. ఈ విషయమ్మీద కొంతమంది విలేకర్లతొ మాట్లాడగా, న్యూయార్క్ వరల్ద్ పత్రిక విలేకరి మిస్టర్ ఐర్లాండ్ చెప్పింది చెప్పినట్లు రాశాడు. నేనెప్పుడూ స్కెనెక్టడీలో లేను. మేయర్ లున్ ను ఎప్పుడూ కలుసుకోనేలేదు. అతణ్ణించి నాకెప్పుడూ ఉత్తరాలైతే రాలేదు గానీ, మా మాకీ ద్వారా చక్కటి సందేశాలు పంపేవారు. స్కెనెక్టడీ కార్మికులతో కలవాలనుకున్న నా కోరిక మేకీ అనారోగ్యంవల్ల తీరలేదు.

అలాంటి వ్యతిరేక, అంత ప్రాముఖ్యం లేని విషయాల మీద మాత్రం అటు బూర్జువా పత్రికల్లోనూ, ఇటు సామ్యవాద పత్రికల్లోనూ సంపాదకీయాలు వెలువడ్డాయి. ఆ వార్తలతో నా టేబుల్ సొరుగు నిండిపోయింది. అందులో పావు వంతైనా నేను చదవలేదు, చదువుతానన్న ఆశకూడా లేదు. అంత చిన్న విషయానికే అంత స్పందన వచ్చింది కదా, ఇంక నేను సొషలిజం గురించి ఎమైనా రాస్తే, చేస్తే ఈ పత్రికలు ఏం చేస్తాయో ఇంక ఊహించండి. వచ్చిన వార్తా కథనాలలో కొన్ని తప్పుడు వార్తల గురించి, నాకు భావ్యమనిపించని కొంత విమర్శ గురించి, అలగే నా పరిస్థితి గురించి ఇప్పుడు రాద్దామనుకుంటున్నాను. మొదటి విషయం- నేనెలా సోషలిస్ట్ అయ్యానన్నది? చదవడం వల్ల. నేను చదివిన మొదటి పుస్తకం వెల్స్ రాసిన న్యూ వరల్డ్ ఫర్ ఓల్డ్. మేకీ సూచనమేరకు నేనా పుస్తకాన్ని చదివాను. దాని ఊహాత్మకతకు అబ్బురపడిందామె. అందులో ఉన్న అద్భుత శైలి నన్ను ప్రేరణ గావించి ఆసక్తి కలిగిస్తుందని ఆమె ఆశించింది. ఆ పుస్తకం ఇచ్చినపుడు ఆమె సోషలిస్ట్ కాదు, ఇప్పటికీ కాదనుకోండి. ఆమె భర్తా నేనూ కలిసి ఆమెతో వాదిస్తూ ఉంటే బహుశా ఆమె సొషలిస్ట్ గా మారుతుందేమో.

నా అధ్యయనం పరిమితమైంది మాత్రమే కాదు నెమ్మదైందె కూడా. బధిరుల కోసం బ్రెయిలీలో ముద్రించిన జర్మన్ ద్విమాస పత్రిక సోషలిస్ట్ తీసుకున్నాను. (చాలా విషయాల్లో మన జర్మన్ కామ్రేడ్లు మనకంటే ముందుటారు) ఎర్ఫర్ట్ ప్రొగ్రాంపై కౌట్ స్కీ జరిపిన చర్చ కూడా నా దగ్గర జర్మన్ బ్రెయిలో ఉంది. వారానికి మూడుసార్లు నా స్నేహితురాలొకరు నా చేతులపై రాయడమనే భాష ద్వారా నేను కోరుకున్న సాహిత్యం కూడా చదువుకోగలిగాను. ఆవిడ సజీవమైన చేతివేళ్ల ద్వారా నేను చాలా తరచుగా చదివించుకున్నది నేషనల్ సోషలిస్ట్ పత్రిక. ఆమె వ్యాసాల శీర్షికలు చదివేది. ఏవి చదవాలో వద్దో నేను చెప్పేదాన్ని. నాకు ఆసక్తి కలిగించిన మరికొన్ని వ్యాసాలను ఇంటర్నేషనల్ సోషలిస్ట్ రివ్యూనుంచి చదివించుకున్నా. ఇలా ఒక్కో అక్షరమే చదవడానికి చాలా సమయం పడుతుంది. ఆర్థిక శాస్త్రంలో యాభై వేలకు పైగా పదాలున్న పుస్తకాన్ని చేతి వేళ్లతో ఒక్కో అక్షరమే రాసుకుంటూ చదవడం అంత సులువైన సంగతేమీ కాదు. కానీ అదంతా నాకు ఓ సంతోషకరమైన పని. ప్రామణిక సోషలిస్ట్ రచయితలను వంట పట్టించుకున్నంతవరకు ఆ సతోషకర కార్యంలోనే మునిగిపోయేదాన్ని.

ఈ సందర్భంలో సోషలిస్ట్ వ్యతిరేక పత్రికలు కామన్ కాజ్, లైవ్ సంచికల్లో వచ్చిన వార్తా కథనాన్ని వ్యాఖ్యానించాలను కుంటున్నాను. ఆ వార్తలో చిన్న భాగాన్ని ఉటంకిస్తాను: “కెల్లర్ కు గత పాతికేళ్లగా ఉపాధ్యాయురాలూ సహచారిణిగా శ్రీమతి జాన్ మేసీ పనిచేస్తున్నారు. మేసీ దంపతులిద్దరూ మార్క్సిస్ట్ సిద్ధంత ప్రచారకులు. జీవితం గురించిన సమస్తమైన అవగాహన కోసం కెల్లర్ మేసీమీదే ఆధారపడాలి. సహజంగానే వారి అభిప్రాయాలు ఈవిడవవుతాయి.” మిష్టర్ మేసీ ఆసక్తి గలిగిన మార్క్సిస్ట్ సిద్ధాంత ప్రచారకుడు కావచ్చు. కానీ నేనిలా అంటున్నందుకు మరోలా భావించకండి, అతను నాకెన్నడూ మార్క్సిజాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేయలేదు. ఇక శ్రీమతి మేసీ ముందే చెప్పుకున్నట్టు మార్క్సిస్ట్ గాని, సోషలిస్ట్ గాని కానే కాదు. అందుచేత కామన్ కాజ్ చెప్పిందాంట్లో వాస్తవమే లేదు. ఆ సంపాదకుడు దీన్నంతా జాగ్రత్తగా పరిశీలించినాక కూడా ఇదే మాటనగలిగితే అతదు ఖచ్చితంగా సోషలిస్ట్ వ్యతిరేకన్న మాట. సోషలిస్టే కాదు అతడు బౌధ్ధికమైన ఏ రకమైన మేధావీ కాలేడు.

అదే వ్యాసం నుంచి మరో వాక్యాన్ని ఉటంకిస్తాను. దాని శీర్షికే ఇలా ఉంటుంది. “స్కెనెక్టడి కమ్యూనిస్టుల ప్రచారం. ప్రచారం కోసం అంధ బాలిక హెలెన్ కెల్లర్ ను వినియోగించుకుంటున్న వైనం.” పుడు అసలు కథనం ప్రారంభమవుతుంది. “అమాయక హెలెన్ కెల్లర్ ను స్కెనెక్తడీ సోషలిస్ట్ లు వినియోగించుకుంటున్న తీరును చూస్తే అంతకంతే దయనీయమైన గాథ మరొకటి ఊహించను కూడా ఊహించలేం. ఆవిడ సోషలిస్టనీ, త్వరలోనే అక్కడి ప్రజా సంక్షేమ బోర్డులో సభ్యత్వం తీసుకుంటుందని పార్టీ ప్రెస్ ఏజన్సీ కొద్ది వారాలుగా ప్రచారం చేస్తోంది.”అమాయక హెలెన్ కెల్లరును దోపిడీ చేయడమనే వాక్యమ్మీద వ్యంగ్యం పండించొచ్చు. కానీ నేనేమీ అనదలచుకోలేదు. కామన్ కాజ్ లాంటి పత్రిక చూపించే హిపోక్రటిక్ సానుభూతి నాకవసరం లేదు. కాని వారికి “దోపిడీ” అంటే అర్థం తెలుసా అన్నదే ప్రశ్న. ఇక నిజానిజాల సంగతి చూద్దాం.

నేను స్కెనెక్టడీకి వెళ్లవచ్చని మేయర్ లున్ కు తెలిసినపుడు ప్రజా సంక్షేమ బోర్డు నేనుండదగిన ప్రదేశమని చెప్పారు. మేయర్ లున్ తన పత్రిక ది సిటిజెన్ లో కూడా ఈ సంగతులేవీ ప్రచురించలేదు. నేను స్కెనెక్టడీ చేరేంతవరకూ దీని గురించి మాట్లాడకూడదని బోర్డు కూడా భావించింది. కానీ బూర్జువా పత్రికలకు ఇది తెలిసి, ఒకరోజు మేయర్ స్కెనెక్టడీలో లేని సమయాన ఆల్బనీకి చెందిన నికర్బాకర్ ప్రెస్ వాళ్లు ఈ ప్రకటన చేశేసారు. ఈ వార్త దేశమంతా పాకి నిజమైన పత్రికల దోపిడీ మొదలైంది. సోషలిస్ట్ పత్రికల వల్లా కాదు, పెట్టుబడిదారీ పత్రికల వల్ల. సోషలిస్ట్ పత్రికలు కూడా ఈ వార్తను ప్రచురించాయి, మరికొన్ని పత్రికలైతే స్వాగతం చెప్తూ సంపాదకీయాలు కూడా రాశాయి. మిగతా పత్రికలన్నీ ఇంటర్వ్యూల కోసం టెలిఫోన్లలోనూ, టెలీగ్రాఫుల్లోను ప్రయత్నించిన వారాలన్నీ మేయర్ లున్ పత్రిక మాత్రం నా పేరేమీ ప్రస్తావించకుండా మౌనం వహించింది. దోపిడీ జరపిందంతా పెట్టుబడిదారీ పత్రికలే. ఎందుచేత? మామూలు పత్రికలు సోషలిజాన్ని పట్టించుకుంటాయా? కోవు, పైగా అసహ్యించుకుంటాయి. కానీ పత్రికల వదంతులకు నేను వస్తువయ్యాను. నేను స్కెనెక్టడీలో లేనని చెప్పలేక చచ్చాను. ఈ వార్త మొదట ప్రచురించిన విలేకరిమీద నాకు కోపం మొదలయ్యింది. కాపిటలిస్ట్ పత్రికల్లో నా గురించి ‘సోషలిస్ట్ నని విస్తృత ప్రచారం జరిగినాక, సోషలిస్ట్ పత్రికల్లో మాత్రం వైఖరి మారింది. అయితే నన్ను చూడడానికి వచ్చిన విలేకరులంతా మామూలు వాణిజ్య ధోరణిగల పత్రికల వాళ్లు. నేషనల్ సోషలిస్ట్ గానీ ది కాల్ గానీ లేదా మరే ఇతర సోషలిస్ట్ పత్రికలు గానీ నన్ను వ్యాసాలు రాయమని అడగలేదు. ది సిటిజెన్ పత్రిక ఎడిటర్ మాత్రం మిస్టర్ మాకీ వద్ద వ్యాసం గురించి పరోక్షంగా ప్రస్తావిమ్హారే గానీ నాతో సూటిగా ఏమీ అనలేదు. న్యూయార్క్ టైంస్ ఒక వ్యాసం రాయమని కోరింది. ఆ పత్రిక సంపాదకుడు ఉత్తరం రాస్తూ జనబాహుల్యంలోకి నా అభిప్రాయాలు చేరడానికి తన పత్రిక తోడ్పడుతుందని అన్నారు. ఆనక స్కెనెక్టడీ ప్రజా సంక్షేమ బోర్దులో సభ్యురాలిగా నా ప్రణాళికలూ, నా విధుల గురించిన వివరాలు పంపమని తంతి పంపారు. నేనొప్పుకోలేదు. ఫలితమేమంటే తర్వాత కొద్ది రోజులకే టైంస్ నన్ను కనీస సానుభూతి లేకుండా బహిష్కృతురాల్ని చేసింది. సెప్టెంబర్ 21న టైంస్ లో “సంతృప్త ఎర్ర జెండా” పేరుతో సంపాదకీయం వెలువడింది. అందులోంచి రెండు పేరాలు కోట్ చేస్తాను. ” జెండాది స్వేచ్చ. అసహ్యించుకోకుండా ఉండలేం. ప్రపంచమంతా అరాచకానికీ, అన్యాయానికీ చిహ్నమది. సరైన వ్యక్తులందరూ ఇప్పుడు దాన్ని సంతృప్తితో చూస్తున్నారు.” “ఎర్ర జెండాను పట్టుకున్న కార్యకర్త ఏదో ఒకటి చేస్తేనే పోలీసులు కొడతారు. కార్యకర్తలెప్పుడూ తమను అనుమానితులుగానే అందరూ చూసేట్లుగా ప్రవర్తిస్తారు. జెండా పట్టుకున్నంత మాత్రానే గౌరవ మర్యాదలను వదులుకునేట్టు ప్రవర్తిస్తారు.” నేనే రంగు గుడ్డనూ పూజించను గానీ ఎర్ర జెండాను పేమిస్తాను. అది నాకూ, తోటి సోషలిస్టులకు అందించే చిహ్నాల కోసం ప్రేమిస్తాం. నేను చదువుకుంటున్న గదిలో జెండా ఎగురుతోంది. టైంస్ విలేకరులు, ఫోటోగ్రాఫర్లు సుందర దృశ్యం వీక్షించేలా ఆ కార్యాలయం ముందరే జెండా ఎగరేసుకుంటూ తిరగగలను. టైంస్ చెప్పినట్లుగానే గౌరవం, సానుభూతులను ధిక్కరించి అనుమానానికి గురయ్యేట్టుగా ప్రవర్తిస్తాను. అయినా ఆ ఎడిటర్ నన్నో వ్యాసం రాయమని అడగడం విడ్డూరం. నేనో అనుమానితురాలినైతే నా రాతల్ని ఎలా నమ్ముతారు? వాళ్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నిందించిన సంపాదకుడు రాయమని కోరిన వ్యాసంలో నీతులు, తర్కం, రాసే పద్ధతి ఎంత వెటకారంగా ఉంటాయో ఊహించండి. వాళ్లు డబ్బు చేసుకోవడానికి వీలుగా మాలో కొంతమంది వాళ్లకే ఎమైనా రాయొచ్చు గాక, మాకే సానుభూతీ అక్కర్లేదు. ఖూనికోరు ఒప్పుకోలులో ఉన్న నిజాయితీయే అతడు మా అభిప్రాయాలలో బహుశా గ్రహిస్తాడేమో. మేం నైస్ మనుషులం కాదు. కాని ఆసక్తి గొలిపే మనుషులం. అంతే. పత్రికల వాళ్లంటే నాకిష్టమే. ఎంతోమంది విలేకరులు నాకు తెలుసు. ఇద్దరు ముగ్గురు సంపాదకులు నాకు మంచి దగ్గరి స్నేహితులు కూడా.

అంతేకాక మేం బధిరుల కోసం చేస్తున్న కృషిలో పత్రికలందిస్తున్న సాయం ఎంతో గొప్పది. గుడ్డి వాళ్లకు గాని, మరే ఇతర వికలురుకు దాతృత్వం చేయడంలో పత్రికల వాళ్లకు పెద్దగా ఖర్చయ్యేదేమీ ఉండదు. మరి సోషలిజమో - అయ్యో అది వేరే సంగతి లెండి. అది పేదరికం, దాతృత్వం మూలాల్లోకి తొంగిచూస్తుంది. పత్రికల వెనకనున్న డబ్బుకు సోషలిజం అంటే పడదు. వాళ్లిచ్చే డబ్బుతో బతికే సంపాదకులు డబ్బుకోసమే పనిచేస్తారు. సోషలిజాన్ని, సోషలిస్టుల ప్రభావాన్ని నీరుగార్చే ఏపని చెయ్యడానికైనా సిద్ధపడతారు. నేను కామ్రేడ్ ఫ్రెడ్ వారెన్ కు రాసిన ఉత్తరం అప్పీల్ టు రీజన్ లో ప్రచురితమైనపుడు బోస్టన్ ట్రాన్స్ క్రిప్ట్ లో పనిచేస్తున్న నా మిత్రుడొకరు ఒక వ్యాసం రాస్తే దాన్ని వాళ్ల చీఫ్ ఎడిటర్ తీసి అవతల పారేశాట్ట.

నాకు, సోషలిజానికి స్పందనగా బ్రూక్లిన్ ఈగిల్ ఏమని రాసిందంటే హెలెన్ కెల్లర్ పెరుగుదలలో (వికాసంలో) ఉన్న పరిమితులవల్లే ఈ తప్పులు జరిగాయని పేర్కొంది. కొన్ని సంవత్సరాల కిందట ఓ పెద్ద మనిషిని కలిశాను. అతడు బ్రూక్లిన్ ఈగిల్ ఎడిటర్ మెక్ కెల్వే అట. న్యూయార్క్ లో జరిగిన బధిరుల సమావేశం అనంతరం కలిశాం. ఆరోజు అతడు నన్ను పొగిడిన వైనం ఇప్పుడు తలచుకున్నా సిగ్గుపడిపోతాను. కానీ ఇప్పుడు నేను సోషలిజం గురించి మాట్లాడేసరికి ఆ పెద్దమనిషి నాకు, ప్రజలకు చెప్తున్నదేమిటంటే గుడ్డి, చెవిటి వాళ్లు తప్పులు చేసే ప్రమాదముందని. అతడిని కలిసిన తర్వాత నేనేదో కొంత జ్ఞానం పొందాను. ఇప్పుడు సిగ్గుపడాల్సింది అతను. బహుశా మూగతనం, చెవిటితనం ఓ మనిషిని సోషలిస్టుగా మారుస్తాయేమో. మార్క్స్ బహుశా పాషాణ చెవిటివాడు. విలియం మోరిస్ గుడ్డివాడు. మోరిస్ బహుశా స్పర్శ జ్ఞానంతోనే బొమ్మలు గాసి ఉంటాడు. ఓహో మూర్ఖ బ్రూక్లిన్ ఈగిల్, ఎంత అజ్ఞానమది? సామాజిక అంధత్వం, బధిరత్వం ఇవే భరించలేని వ్యవస్థలు. ఇవ్వాళ మనం పోరాడుతున్న శారీరక అంధత్వం, బధిరత్వాలకు మూల కారణం. మనం ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడనంతవరకు మనల్ని ఈ ఈగిల్ (గద్ద) మనల్ని సపోర్ట్ చేస్తుంది. దుఖానికి కారణమైన దేన్నీ వినకుండా చెవులు మూసే, దృష్టిని మసకబార్చే వాటిని ఎవరూ ఏమీ అనగూడదు. నేనూ గద్దా యుద్ధంలో ఉన్నాం. దానికి ప్రాధినిధ్యం వహించే, దాని గురించి పోరాడే దుర్ వ్యవస్థను నేను అసహ్యించుకుంటాను. అయినా యుద్ధంలో దిగినాక సజావిగానే అంతా సాగాలి. ఆ యుద్ధం నా భావాలమీద జరగనివ్వండి. సోషలిజం ఉద్దేశాలపైన, వాదనలపైన దాడి జరపనివ్వండి.

నేను చూడలేననో, వినలేననో నాకూ ఇతరులకూ గుర్తుచెయ్యడం ఏమంత మంచి దాడి కాబోదు. నేను చదవగలను. సోషలిజంపై వస్తున్న పుస్తకాలన్నీ చదవగలను. ఇంగ్లీష్, జెర్మన్, ఫ్రెంచ్ భాషల్లో చదవగలను. వాటిల్లో కొన్నైనా ఈగిల్ ఎడిటర్ చదవగలిగితే కాస్త తేలివైన మనిషి అయిఉండేవాడు. పేపర్ని మరికాస్త బాగా తేగలిగేవాడు. సోషలిస్ట్ ఉద్యమానికి నాతరపున అందించాలనుకుంటున్న కోరిక ఏమిటంటే ఒక పుస్తకం రాయాలని. ఆ పుస్తకానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలుసు: ‘పారిశ్రామిక అంధత్వం సామాజిక బధిరత్వం‘.
చెవిటి మూగ కళ్ళు కనిపించని మహిళయిన హెలెన్ కెల్లర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తొలి అంధ బాలిక ఈమె. అయితే చాలా మందికి తెలియనిది- ఆమె గొప్ప రచయిత్రి, విపరీతంగా ప్రయాణాలు చేసి మహిళల హక్కుల కోసం, ఓటు హక్కు కోసం పోరాడింది. ఇరవై మూడేళ్ల వయసులో రాసుకున్న ఆత్మ కథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ (1903) చాలా ప్రసిద్ధి చెందింది. సోషలిస్ట్ భావాల పట్ల ప్రేమ కలిగిన కెల్లర్ రాసిన ఓ వ్యాసాన్ని తెలుగు చేసి మీకందిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి.

(అనువాదం: దుప్పల రవికుమార్)